Wednesday, May 19, 2010

చిన్ని కన్నా

నా చిన్ని కన్నయ్యా ,
నన్ను వదిలేసి వెళ్ళకు అన్నావు . నేను వినకుండా వదిలేసి వచ్చేసాను .
నా మీద కోపమా తండ్రీ ?
అసలు నిన్ను వదిలి నేనెలా జీవిస్తున్నానురా ? అసలు ఇదీ ఒక జీవిత మేనా ?
బుజ్జి కన్నా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావురా .
అన్నం తిందామని కూర్చుంటే , అన్నానికి మారాము చేసే నీ ముద్దు మోమే కని పిస్తొంది . ముద్ద నొటికి దిగటం లేదు .
నిదుర పోదామంటే , నాకు కథ చెప్పకుండా పడుకుంటున్నావా అని అలిగే నీ చిన్నారి బుంగమూతి గుర్తొచ్చి నిదురే రావటము లేదు .
నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ , నా మెడ చుట్టూ చేతులు వేసి , నా బుగ్గ మీద నువ్వు పెట్టే బంగారం ముద్దును ఎలా మరచి పోనురా ?
కనీసం నువ్విచ్చిన నీ ఫొటో చూద్దామన్నా నీరు నిండిన నా కంటికి కనిపించవే !
నీకు నా బాధ ఎలా చెప్పను రా ?
ఒక్కసారి నిన్ను నా హృదయానికి హత్తుకోవాలని తపించి పోతున్నానురా ,
నిస్సహాయురాలైన ఈ అమ్మ కాని అమ్మను శపించకురా తండ్రి .
నీకోసం పరితపించే ఈ అమ్మ కాని అమ్మను క్షమించరా కన్నా !!

No comments: